News

అత్యాచారం ఘటనను ఓ బాలిక బొమ్మ వేసి చూపించింది


తనపై జరిగిన అత్యాచారం ఘటనను ఓ పదేండ్ల బాలిక బొమ్మ వేసి చూపించడంతో రేప్ కేసు నిందితుడికి కోర్టు ఐదేండ్ల జైలుశిక్ష విధించింది. నిలువనీడ ఇచ్చాననే ధీమాతో బాలికపై ఆమె మామయ్యే అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఎలాంటి సాక్ష్యాలు లేక నిందితుడు విడుదలయ్యే సమయంలో కోర్టు అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం అతడికి శిక్ష పడేలా చేసింది. కోల్‌కతాకు చెందిన ఓ బాలిక కుటుంబం చెల్లాచెదురైంది.  ఆమె ఎనిమిదేండ్ల వయసులో తల్లి చనిపోగా, తండ్రి కూడా వదిలేసి వెళ్లాడు. తల్లిదండ్రులిద్దరూ దూరమవడంతో ఆ బాలిక ఢిల్లీలోని మేనత్త ఇంటికి చేరింది. వారింట్లోనే ఉండి చదువుకుంటున్నది. రెండేళ్ల క్రితం ఆ బాలికపై మేనత్త భర్త అక్తర్ అహ్మద్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఆరోపణలతో అతడిని గత ఏడాది జూన్ 4న పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీనికి సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో నిందితుడు తప్పించుకునే అవకాశం ఉందని పోలీసులు భావించారు. విచారణలో భాగంగా కోర్టులో బాలికకు ఓ పేపర్, కొన్ని క్రేయాన్లు ఇచ్చి ఏం జరిగిందో, మామయ్య ఏం చేశాడో బొమ్మగీసి చూపించాలన్నారు. బాలిక తనపై జరిగిన అత్యాచారం తీరును చూపేలా బొమ్మ గీసింది. దీంతో నిందితుడు అక్తర్ అహ్మద్‌కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఓ వదిలేసిన ఇల్లు, బెల్లూన్లు పట్టుకున్న పాప, చిక్కులు పడిన ఆ బెల్లూన్ల దారాలు, పక్కన పడి ఉన్న దుస్తులు ఆ బాలిక స్థితిని తెలియజెప్పేలా ఉంది. రంగురంగుల క్రేయాన్లు ఇచ్చినప్పటికీ విషాదానికి చిహ్నంగా చిన్నారి కేవలం నలుపురంగు క్రేయాన్‌తోనే బొమ్మ వేయడం గమనార్హం. తనపట్ల జరిగిన అన్యాయాన్ని ఆమె ఆ చిత్రంలో చూపింది. బొమ్మలోని ప్రతీదీ ఆధారాల నేపథ్యంలో చూసినందునే దాన్ని బలమైన సాక్ష్యంగా భావించాం అని అదనపు సెషన్స్ జడ్జి వినోద్‌యాదవ్ తెలిపారు. దోషిగా తేలిన అక్తర్‌కు ఐదేండ్ల జైలు శిక్షతోపాటు పదివేల జరిమానా కూడా విధించారు. నష్టపరిహారం కింద మూడు లక్షల రూపాయలను చిన్నారి పేర ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. బాలికను శిశుసంరక్షణాలయానికి పంపారు.